Published on Oct 28, 2026 8:31 PM IST
రోహన్, అరుణ్, ఖుషి ప్రధాన పాత్రల్లో శ్రీకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సమ్మర్ హాలిడేస్’. ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాయి.
పిల్లలు నటించిన పెద్దల సినిమా ఇది!
ఈ సందర్భంగా నిర్మాత ధీరజ్ మాట్లాడుతూ.. “ఈ కథ విన్నప్పుడు చాలా మంది మీడియా మిత్రులు పిల్లల సినిమాతో థియేటర్లకు ఆడియన్స్ వస్తారా అని అడిగారు. వేరే భాషల్లో ఇలాంటి చిత్రాలు వస్తే మనం అభినందిస్తున్నాం, మన దగ్గర ఎందుకు రావట్లేదని ప్రశ్నిస్తున్నాం. ఇది కేవలం పిల్లల సినిమా కానే కాదు, పిల్లలు నటించిన పెద్దల సినిమా. పెద్దవాళ్లు పిల్లల కంటే రెండు, మూడు రెట్లు ఎక్కువగా ఈ కథకు కనెక్ట్ అవుతారు. తలలు తెగడాలు, రక్తపు చుక్కలు కింద పడటం లాంటివేమీ లేకుండా కుటుంబం మొత్తం కలిసి హాయిగా నవ్వుకునేలా తీశాం. థియేటర్లో ఒక్క ఐదు నిమిషాలు కూడా బోర్ కొట్టదు, ఇది నా ప్రామిస్” అని తెలిపారు.
అలాగే సీనియర్ నటి జయసుధ, వాసకి, హర్షవర్ధన్, రాజీవ్ కనకాల వంటి అనుభవజ్ఞులైన నటీనటులు ప్రాజెక్ట్‌లోకి రావడం సినిమాకు ఎంతో బలాన్ని ఇచ్చిందని చెప్పారు. ‘90s’ వెబ్ సిరీస్ ఫేమ్ రోహన్, అరుణ్ నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని కొనియాడారు.
శ్రీ విష్ణుతో రూ. 100 కోట్ల బ్లాక్‌బస్టర్ కొడతా..
ఈవెంట్‌కు విచ్చేసిన హీరో శ్రీ విష్ణు గురించి మాట్లాడుతూ ధీరజ్ భావోద్వేగానికి లోనయ్యారు. “మెంటల్ మదిలో సినిమా రోజుల నుంచి విష్ణు గారితో నాకు మంచి పరిచయం ఉంది. నేను ఒక ఫోన్ కాల్ చేసిన వెంటనే ఏది అడిగినా కాదనకుండా వచ్చారు. భవిష్యత్తులో నేను ఎన్ని సినిమాలు తీసినా, శ్రీ విష్ణు గారితో ఒక ప్రాజెక్ట్ చేసి ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందించి, రూ. 100 కోట్ల పోస్టర్ వేసిన రోజే నాకు నిజమైన సంతృప్తి దక్కుతుంది” అని చెప్పారు.
గతంలో ‘సంక్రాంతి’, ‘దసరా’ చిత్రాలు ఆయా పండుగ సీజన్లలో కాకుండా ఇతర సమయాల్లో వచ్చినా సూపర్ హిట్లు అయినట్లే, తమ ‘సమ్మర్ హాలిడేస్’ కూడా దీపావళి సందర్భంగా నవంబర్ 6న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరిస్తుందని నిర్మాత ధీరజ్ ధీమా వ్యక్తం చేశారు.
