Published on Nov 5, 2026 9:46 PM IST
సాయి దుర్గా తేజ్, కిరణ్‌ల నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. కొణిదెల, అల్లు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత ఆత్మీయులు, ఆప్తమిత్రుల సమక్షంలో ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన దంపతులు కాబోతున్న సాయి దుర్గా తేజ్, కిరణ్‌లను కుటుంబ సభ్యులందరూ ఆశీర్వదించి, తమ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, వీరి వివాహ మహోత్సవం 2026 డిసెంబర్ 10న హైదరాబాద్ వేదికగా అత్యంత ఘనంగా జరగనుంది.
ఈ వేడుకకు సాయి దుర్గా తేజ్ తల్లిదండ్రులు డాక్టర్ శివప్రసాద్, విజయదుర్గ, సోదరుడు వైష్ణవ్ తేజ్‌లతో పాటు మెగాస్టార్ చిరంజీవి-సురేఖ, రామ్ చరణ్, అల్లు అర్జున్-స్నేహా రెడ్డి, వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి దంపతులు, నాగేంద్రబాబు కుటుంబం, అల్లు అరవింద్ కుటుంబం, నిహారిక, అకిరా నందన్, ఆద్య తదితరులు హాజరై సందడి చేశారు. వీరితో పాటు సినీ పరిశ్రమ నుంచి మంచు మనోజ్-మౌనికా రెడ్డి, నవీన్ విజయ్ కృష్ణ, హర్ష చెముడు, వెంకీ కుడుముల, నవదీప్, హర్షిత్ రెడ్డి తదితర సన్నిహితులు పాల్గొని నూతన జంటకు తమ ప్రేమాభిమానాలను అందించారు.
