Published on Nov 17, 2026 11:02 PM IST
కింగ్ నాగార్జున సమర్పణలో, అనీష్ హీరోగా పరిచయమైన ‘ఇట్లు అర్జున’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు, అనీష్ నటనకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా జరిగిన ఈ సినిమా సక్సెస్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. “నేను పున్నమి నాగు, నాగార్జున గీతాంజలి, రామ్ చరణ్ రంగస్థలం, అఖిల్ లెనిన్ వంటి పాత్రలను అనుభవం వచ్చిన తర్వాత చేశాం. కానీ అనీష్ తన తొలి సినిమాలోనే మూగవాడి పాత్రను ఎంచుకోవడం సాహసమే. అతని మెచ్యూర్డ్ యాక్టింగ్, ఈజ్ నా మనసు గెలుచుకున్నాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోశాయి. అనస్వర రాజన్ చిరునవ్వులో ఎంతో అమాయకత్వం ఉంది. ఇంతటి ఫ్రెష్ సినిమాను అందరూ థియేటర్లలో తప్పక చూడాలి” అని కొనియాడారు.
ఈ వేడుకలో కింగ్ నాగార్జున మాట్లాడుతూ కొత్త ప్రతిభను ఎప్పుడూ ఆదరించే ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. బాక్సాఫీస్ వద్ద ‘ఇట్లు అర్జున’ సాధిస్తున్న విజయం పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. హీరో అనీష్ మాట్లాడుతూ తనను, కథను నమ్మిన నిర్మాత వెంకీ కుడుముల, వెన్నెముకలా నిలిచిన నాగార్జున గారితో పాటు సపోర్ట్ చేసిన నాని, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు ధన్యవాదాలు తెలిపాడు.
