వెర్సటైల్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు పవన్ సాధినేని డైరెక్షన్లో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో సాత్విక వీరవల్లి హీరోయిన్గా ఇంట్రొడ్యూస్ అవుతోంది. శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్ర గ్లింప్స్, టీజర్, ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. నవంబర్ 20న వరల్డ్‌వైడ్ రిలీజ్ అవుతున్న ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు పవన్ సాధినేని మీడియాతో ముచ్చటించారు.
ఆకాశంలో ఒక తార ఎలా ఉండబోతోంది?
ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. నిర్మాతలు మొదలుకొని అందరూ ఈ సినిమాకు సపోర్ట్‌గా నిలిచారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరి మనసులో నవ్వు కనిపిస్తుంది. ఫ్యామిలీ, పిల్లలతో కలిసి హాయిగా చూసే సినిమా.
ఆకాశంలో ఒక తార స్త్రీ సాధికారతకు సంబంధించిన కథనా? ఇందులో డ్రామా ఎలా ఉండబోతోంది?
ఇది కేవలం మహిళా సాధికారత గురించో, సందేశం ఇవ్వడానికో తీసిన సినిమా కాదు. సమాజంలో ఇద్దరూ కలిసి జీవించే ప్రయాణంలో… ఓ అమ్మాయి తన కల సాధనలో ‘కృష్ణ’ ఎలాంటి ప్రోత్సాహం అందించాడనేదే ఈ అందమైన కథ. నెగెటివిటీ నిండిన ఈ రోజుల్లో, సినిమా చూశాక ప్రతి ఒక్కరికీ మన జీవితంలోనూ కృష్ణ లాంటి పాత్ర ఉంటే బాగుంటుందనే ఫీలింగ్ కలుగుతుంది.
అల్లు అరవింద్ గారు, గుణ్ణం గంగరాజు గారు, స్వప్న గారు.. ఇలా లెజెండరీ ప్రొడ్యూసర్స్‌ను ఈ కథతో ఎలా ఒప్పించారు?
ఈ కథే వాళ్లందరినీ ఒప్పించింది. కథ వినగానే ఎలాంటి మార్పులు చెప్పకుండా, నేను చెప్పినదాన్ని చెప్పినట్లే తీయమని ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ముందుగా గుణ్ణం గంగరాజు గారి అబ్బాయి సందీప్‌కు ఈ కథ చెప్పాను. ఆ తర్వాత నా ‘సేనాపతి’ సినిమా చూసి నన్ను అడిగిన అల్లు అరవింద్ గారు ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ఇక దుల్కర్ గారికి కథ చెప్తున్నప్పుడు అది నచ్చి, ఇలాంటి మంచి కథను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో స్వప్న గారు కూడా భాగస్వాములయ్యారు.
కృష్ణ పాత్ర రాసుకున్నప్పుడు దుల్కర్ గారిని ఉద్దేశించుకుని రాసుకున్నారా?
ముందు నేను కథ, పాత్రలను రాసుకుని, వాటికి ఎవరు న్యాయం చేయగలరో చూస్తాను. ఈ కథ బాగా నచ్చిన దుల్కర్ గారు, ‘కృష్ణ’ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి 100 శాతం న్యాయం చేశారు.
హీరోయిన్ సాత్విక గురించి?
హీరోయిన్ చుట్టూ నడిచే కథ కావడంతో, పేరున్న నటిని కాకుండా కొత్త ముఖాన్ని ఎంపిక చేయడం మాకు మొదటి నుంచీ పెద్ద ఛాలెంజ్. ఆ సమయంలో సోషల్ మీడియా రీల్స్‌లో భరతనాట్యం కూడా తెలిసిన సాత్వికను చూసి, ఆడిషన్ ద్వారా ఎంపిక చేశాం. తను ఆ పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయింది.
శ్రుతి హాసన్ పాత్ర గురించి?
ఈ కథలో శ్రుతి హాసన్ పాత్ర చాలా కీలకం. ఇప్పటివరకు ఆమె చేసిన వాటిలో ఇది అత్యుత్తమ పాత్రగా నిలిచి, కెరీర్లోనే గుర్తుండిపోతుంది. ఆమె పాత్రను చూసి ప్రతి మహిళా స్ఫూర్తి పొందుతుంది.
కొత్త సినిమాల గురించి?
కొంతమంది ప్రొడ్యూసర్స్‌తో కొన్ని ప్రాజెక్టుల కమిట్మెంట్స్ ఉన్నాయి. ఈ సినిమా తర్వాత వాటి పూర్తి వివరాలు తెలియజేస్తాను.
