Published on Nov 9, 2026 11:02 PM IST
అనీష్ హీరోగా పరిచయమవుతున్న తొలి చిత్రం ‘ఇట్లు అర్జున’ మ్యూజిక్ కాన్సర్ట్ వేడుక పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో హీరో అనీష్, హీరోయిన్ అనస్వర రాజన్ వేదికపై చేసిన డాన్స్ పెర్ఫార్మన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అఖిల్ అక్కినేని.. డెబ్యూ హీరో అనీష్‌పై, అతను సినిమా కోసం పడిన కష్టంపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇప్పటికే సినిమా చూశానని తెలిపిన అఖిల్, కొత్త తరహా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో థియేటర్లలో ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
దర్శకుడు మహేష్ ఉప్పాలకు అభినందనలు తెలిపిన అఖిల్, “ఒక కొత్త సబ్జెక్ట్‌ను రాసుకున్నందుకు ధన్యవాదాలు. ఈ సినిమాలో ఆఫ్‌బీట్ కంటెంట్‌తో పాటు మాస్ కమర్షియల్ అంశాలు చక్కగా కుదిరాయి” అని అన్నాడు. అలాగే హీరోయిన్ అనస్వర రాజన్ నటనను, ప్రధాన జంట మధ్య ఉన్న కెమిస్ట్రీని ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. ఇక అనీష్ గురించి మాట్లాడుతూ.. “పదేళ్ల క్రితం నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు అనీష్ లాగా ఉండాల్సింది. అతన్ని చూసి నేను నేర్చుకోవాల్సింది ఉంది. సినిమాను ముందుకు నడిపించిన తీరు, ప్రొడక్షన్ బాధ్యతలు తీసుకున్న విధానం చూస్తుంటే తన తండ్రికి ఎంతో గర్వకారణంగా అనిపిస్తుంది” అని భావోద్వేగంగా పేర్కొన్నాడు.
