Published on Nov 2, 2026 9:07 PM IST
సినీ రంగాన్ని తీవ్రంగా కలవరపెడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగంపై మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన ఈ తండ్రీకొడుకులు.. సినీ నటుల ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత గౌరవం మరియు క్రియేటివ్ కంటెంట్‌కు డీప్‌ఫేక్స్ వల్ల కలిగే ప్రమాదాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కాలంలో పలువురు సినీ ప్రముఖుల ఫోటోలు, వీడియోలు ఏఐ ద్వారా విపరీతంగా దుర్వినియోగానికి గురవుతున్న నేపథ్యంలో, ఈ భేటీకి సామాజికంగా మరియు పరిశ్రమ పరంగా ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ సమస్యపై సానుకూలంగా స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, దీనిపై కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా దృష్టి సారిస్తుందని హామీ ఇచ్చారు. ఏఐ సాంకేతికత అక్రమ వినియోగాన్ని అరికట్టేందుకు, నటీనటుల హక్కులను కాపాడేందుకు తగిన రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు, కఠినమైన చట్టాలు మరియు శిక్షలను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఈ ప్రధాన సవాలుపై మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ చొరవ తీసుకోవడం పట్ల పలువురు సినీ రంగానికి చెందిన ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
