ఓటీటీ వేదిక : జియో హాట్‌స్టార్
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : అక్టోబర్ 22, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : విశ్వదేవ్ రాచకొండ, శివాత్మిక రాజశేఖర్, ధనరాజ్ వినీత్, రమేష్ కొనంబొట్ల, అవసరాల శ్రీనివాస్ తదితరులు
దర్శకత్వం : ఆదిత్య మండల
నిర్మాత : సుష్మిత కొణిదెల
సంగీతం : సిద్ధార్థ్ సదాశివుని
ఛాయాగ్రహణం : ఫహద్ అబ్దుల్ మజీద్
కూర్పు : సిద్దేశ్ చౌదరి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న తాజా తెలుగు సిరీస్ ‘వరం’. చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై దీనిని నిర్మించారు. ఈ సిరీస్‌లో విశ్వదేవ్ రాచకొండ, శివాత్మిక రాజశేఖర్, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం మొదటి రెండు ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఈ ఎపిసోడ్లు ఎలా ఉన్నాయో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
రాజు (విశ్వదేవ్ రాచకొండ) ఒక బస్తీలో నివసిస్తూ, బాత్రూమ్లు శుభ్రం చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఎలాగైనా ధనవంతుడై సమాజంలో గౌరవం పొందాలనేది అతని కల. ఒకరోజు, ఒక వృద్ధురాలు అతనికి ఒక వరాన్ని ప్రసాదిస్తుంది. ఆ తర్వాత నుంచి అతనికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందుగానే తెలుసుకునే శక్తి లభిస్తుంది. ఆ తర్వాత ఏమైంది అనేదే ఈ సిరీస్ కథాంశం.
ప్లస్ పాయింట్స్:
ధనవంతుడు కావాలని తీవ్రంగా తపించే వ్యక్తిగా విశ్వదేవ్ రచకొండ మంచి నటనను కనబరిచాడు. తన పరిస్థితిని చూసి జనం ఎగతాళి చేసినప్పుడు ఆయన మౌనంగా ఉండే సన్నివేశాలు బాగా పండాయి.
శివాత్మిక రాజశేఖర్ ఒక బోల్డ్ పాత్రలో నటించింది. మెయిన్ లీడ్‌తో ఆమె బంధాన్ని చక్కగా చూపించారు. రాబోయే ఎపిసోడ్లలో వీరి సంబంధం ఎలా ముందడుగు వేస్తుందో చూడాల్సి ఉంది. నెగిటివ్ పాత్రలో శ్రీనివాస్ అవసరాల పర్వాలేదనిపించాడు. అయితే ఆయన నటనను పూర్తిస్థాయిలో అంచనా వేయడానికి అతని పాత్రను ఇంకా చూపించాల్సి ఉంది.
ఓపెనింగ్ సీన్స్‌ను నీట్‌గా హ్యాండిల్ చేస్తూ కథను బాగా ఎస్టాబ్లిష్ చేశారు. సెటప్ బాగుంది, అలాగే కొద్దిపాటి హాస్యం కథనానికి ప్లస్ అయింది.
మైనస్ పాయింట్స్:
మొదటి ఎపిసోడ్ బాగున్నప్పటికీ, రెండో ఎపిసోడ్ కొన్ని చోట్ల కొంచెం నెమ్మదించినట్లు అనిపిస్తుంది. హీరోకి వరం లభించిందని తన స్నేహితులకు నమ్మించడానికి ప్రయత్నించే సన్నివేశాలను ఇంకాస్త మెరుగ్గా తీర్చిదిద్ది ఉండాల్సింది.
శివాజీ రాజా, సురభి ప్రభావతి ఇద్దరూ టాలెంటెడ్ యాక్టర్స్ అయినా, ఇప్పటివరకు వారికి పర్ఫార్మ్ చేసేందుకు స్కోప్ లభించలేదు. శ్రీనివాస్ అవసరాల పాత్రను మరింత సమర్థవంతమైన విలన్‌గా మార్చడానికి ఆ పాత్రకు మరింత డెప్త్ అవసరం ఉన్నట్లుగా అనిపిస్తుంది.
సాంకేతిక విభాగాలు :
దర్శకుడు ఆదిత్య మండల కంటెంట్‌ను ఆసక్తికరంగా చూపెట్టేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. మిగిలిన ఎపిసోడ్లలో కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తే సిరీస్ బాగా వచ్చే అవకాశం ఉంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదనిపించినా, సౌండ్ మిక్సింగ్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు పర్వాలేదు.
తీర్పు:
మొత్తంగా చూస్తే, ‘వరం’ సిరీస్ నటీనటుల నుంచి ముఖ్యంగా విశ్వదేవ్ రాచకొండ నుంచి మంచి పర్ఫార్మెన్స్తో పర్వాలేదనిపించేలా ప్రారంభమైంది. సెటప్ బాగున్నప్పటికీ, రెండో ఎపిసోడ్లో కథనం కాస్త స్లో అయినట్లు అనిపిస్తుంది. రాబోయే ఎపిసోడ్లలో ఆసక్తికరమైన కథనం ఉంటే ఈ సిరీస్ మంచి ఇంప్రెషన్ కొట్టేస్తుంది. అలాగే కొన్ని పాత్రలను ఇంకా బాగా డిజైన్ చేసి ఉండాల్సింది. సూపర్ నేచురల్ థ్రిల్లర్లు ఇష్టపడేవారు ఈ సిరీస్‌ను ట్రై చేయవచ్చు.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team
